| << Newer | Post Comments | Older >> |

మెగాస్టార్ చిరంజీవి పార్టీ లో విబేధాల సెగ మొదలైంది. పార్టీ పుట్టి నాలుగు నెలలు కూడా పూర్తిగా నిండక మునుపే ప్రజారాజ్యం పార్టీ లో చిరంజీవి నాయకత్వం పై అనుమానాలు పొడసూపుతున్నాయి. చిరంజీవి మాటల్లో గాని, చేస్తున్న ప్రకటనల్లో కాని స్పష్టత కరవైందన్న వాదన నిజామని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత , కాంగ్రెస్ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యుడు చిరంజీవి కి రాసిన లేఖ ద్వారా అర్థం అవుతోంది. సామాజిక న్యాయం అన్న పదాన్ని ప్రతి అంశానికి జోడించడం తో పాటు సామాజిక న్యాయం అంటే ఏంటి అన్న దానికి చిరంజీవి సరైన నిర్వచనం ఇవ్వకపోవడం కూడా పార్టీ లో కొంత గందర గొళానికి దారి తీసింది. పార్టీలో సీనియర్లకు పెద్దగా విలువ లేదన్న విషయం బహిరంగ రహస్యం. వారిని పార్టీ విశ్వాసం లోకి తీసుకోవడం లేదన్న దానిపై కూడా చాలా మంది లోలోపల రగిలిపోతున్నారు.
చిరంజీవి పై ఎన్నో ఆశలు పెట్టుకొని ఆ పార్టీ సంచలనం సృష్టిస్తుందని బావించి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నపుడే చిరు నామ జపం చేసిన హరిరమ జోగయ్య పార్టీకి , ఎమ్.పి. పదవికి రాజీనామా చేసి చిరు పార్టీలో చేరారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన జోగయ్య చిరంజీవికి రాసిన లేఖ సంచలనం రేపింది. లేఖలోని సారాంశం మొత్తం గురించి మీడియాలో వచ్చిన వార్తల పై స్పందించిన జోగయ్య తాను చిరంజీవి కి లేఖ రాసిన మాట వాస్తవమే నని అంగీకరించారు.
ప్రజారాజ్యం పార్టీ పై ఆయనలో అనుమాన బీజం పడింది ఇప్పుడు కాదు చాలా రోజుల కిందటే పడిందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి వై. ఎస్. ఇటీవల ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించినపుడు పార్టీ వారితో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తన తండ్రి పి. ఆర్. పి. లో చాలా అసంతృప్తి ఉన్నారని జోగయ్య కుమారుడు స్వయంగా సి. ఎం. కు చెప్పడం , ఇప్పుడు జోగయ్య పి. ఆర్. పి. అదినేత చిరు కు రాసిన లేఖ తో అవన్నీ నిజమని స్పష్టం అవుతోంది.
జోగయ్య రాసిన లేఖ తో పార్టీలో విభేదాలు తలెత్తినట్లు అర్థం అవుతోంది. చిరంజీవి ని నమ్ముకొని వచ్చిన ఆయనకు తన రాజకీయ భవిష్యత్తు ఏమోతుందో అన్న సందేహం పట్టుకుంది. దాంతో పాటు పార్టీ భవిష్యత్తు పై కూడా ఆయనకు అనుమానం వస్తోంది . కాంగ్రెస్ పార్టీ కి మొదటి నుంచి అండగా ఉన్న ఎస్. సి. లను చిరంజీవి తన పార్టీ వైపునకు ఆకర్షించుకోగలుగుతారా అన్న సందేహం జోగయ్య వ్యక్తం చేస్తున్నారు.
ప్రజా అంకిత యాత్రకు ప్రజల నుంచి లభిస్తున్న స్పందన ను ఓట్ల రూపం లో మలుచుకోగలుగుతారా అన్న దానిపై కూడా అనుమానాలు ఉన్నాయి. అన్నికన్నా ముఖ్యమైనది మొన్నటిదాకా పార్టీ లోని సీనియర్లకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. వారి పై నిఘా ను కూడా పెట్టారు. ఇతర పార్టీలనుంచి వచ్చిన వారితో స్నేహంగా ఉంటూనే వారి కదలికలను గమనించాలని చిరంజీవి తన వారితో చెప్పడం కూడా సీనియర్లకు ఇచ్చగించలేదు. ప్రజారాజ్యం పార్టీలో ఇప్పుడు పడిన విబేధాల బీజం మొక్క గా మారక ముందే చిరంజీవి ఎలా తూంచుతారో చూడాలి.


