| << Newer | Older >> |
on 2008/9/19 21:18:33
మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ పై చిరంజీవి ముద్ర కనిపించడం లేదు. ఆయన పార్టీలో చేరుతున్న వారంతా వలసవాదులే తప్ప కొత్త వారి సంఖ్య చాలా తక్కువ శాతం అని చెప్పాలి. ఇప్పటిదాకా పార్టీ సభ్యత్వ నమోదు మొదలు కాలేదు. కమిటీల నియామకాలు రూపు సంతరించుకోలేదు. చిరంజీవి రాష్ట్ర పర్యటనపై కూడా నిన్నటి దాకా కోర్ కమిటీ ఒక నిర్ణయానికి రాలేక పోయింది. దాంతో విసుగుచెందిన చిరంజీవి తన పర్యటనపై కమిటీ ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించక పోతే తానే ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించాల్సి వస్తుందని కాస్త కారుకుగా వ్యవహరించడం తో పాటు, ఇలా లాభం లేదని కరీం నగర్ జిల్లా పర్యటనకు వెళ్ళాలని ఆయన నిర్ణయించుకొని ఏర్పాట్లు చూడాలని చెప్పారంటే కమిటీ పని తీరు ఆయనను ఎంతంగా అసంతృప్తికి గురి చేసిందో ఆలోచించ వచ్చు. ఇక ప్రజారాజ్యం పార్టీలోకి వస్తున్న వారంతా వలస వాదులే. ఆది కూడా తెలుగు దేశం పార్టీకి చెందిన వారే ఎక్కువ శాతం వస్తున్నారు. టి. డి. పి. తో పోల్చి చూస్తే ఇతర పార్టీల నుంచి వస్తున్న వారి సంఖ్య చాలా తక్కువ అని చెప్పాలి. తమ పార్టీలో 70 శాతం కొత్తవారికి, 30 శాతం అనుభవజ్ఞులకు అవకాశం ఉంటుందని చిరంజీవి చెప్పారు. అయితే పార్టీ ప్రకటన వెలువడి నెల రోజులు సమీపిస్తోంది. ఆయన పార్టీ వలసదారుల తో నిండి పోతోంది. కొత్త వారికి మాత్రం పెద్దగా అవకాశాలు కనిపించడం లేదు. పార్టీలో ఇప్పటికే చేరిన టి. డి. పి. మాజీ ల పెత్తనం బాగా ఎక్కువగా ఉందన్న నిరసనలు కూడా అప్పుడే వినిపిస్తున్నాయి. ప్రజారాజ్యం పార్టీ పై చిరు ముద్ర కన్నా టి. డి. పి. కి ప్రత్యామ్నాయంగా మరో టి. డి. పి. రూపు దిద్దుకుంటుందా అని అని పిస్తోంది. ప్రజారాజ్యం పార్టీ కేవలం టి. డి. పి. నుంచి వలస వస్తున్న వారి నంత తన పార్టీలో కలుపుకోవడం సరైన విధానం కాదని అభిమానులు కూడా వాపోతున్నారు. ప్రజారాజ్యం పార్టీలోకి ప్రతి రోజు టి. డి. పి. కి చెందిన కొంత మంది వచ్చి చేరుతున్నారు. అలా చేరుతున్న వారిలో పార్టీకి చెందిన ముఖ్య వ్యక్తులు, సీనియర్లు పార్టీలో మొన్నటిదాకా కీలక పాత్ర పోషించిన నేతలు పి. ఆర్. పి. లోకి వస్తున్నారు. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో టి. డి. పి. కి క్యాడర్ పోయింది. లీడర్లు వెళ్ళిపోయారు. క్యాడర్ , లీడర్ల కోసం ఆ పార్టీ ఇపుడు అన్వేషించాల్సి వస్తోంది. ఆ రెండు జిల్లాల్లో పార్టీ ఒక రకంగా తుడిచి పెట్టుకొని పోయినట్లే అని చెబుతున్నారు. అలా టి. డి. పి. నుంచి వలస వచ్చినవారి నంత చేర్చుకుంటున్న ప్రజారాజ్యం పార్టీ పై టి. డి. పి. మాజీ నేతల ప్రభావం బాగా చూపడానికి అవకాశముంది. అదే సమయం లో ప్రజారాజ్యం పార్టీ అంటే మరో టి. డి. పి. అన్న ముద్ర పడనుంది. ఈ వలసలు గమనిస్తుంటే చిరు పార్టీ కొత్త పార్టీనా , లేదా పాత టి. డి. పి. నా అన్న అనుమానం వ్యక్తం అవుతోంది.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



