| << Newer | Older >> |
on 2008/6/14 0:55:29
రానున్న ఎన్నికల్లో గెలుపే పరమా వదిగా రాష్ట్రం లోని ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచి తమ కసరత్తు లను ప్రారంభించాయి. ముందస్తు ఎన్నికలకు వ్యూహాలు పన్నుతున్న కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లోనూ జయకేతనం ఎగురవేయడానికి ప్రతి అవకాశాన్ని తనకు అనువుగా మలుచుకుంటుంది. ఈ సారి తమ పార్టీకి 230 అసెంబ్లీ, 36 లోక్ సీట్లు తప్పకుండా వస్తాయని ఆ పార్టీ ప్రభుత్వాధినేత వై. ఎస్. మితిమీరిన ఆత్మ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు సర్వేలు నిర్వహించి పార్టీ పరిస్థితిని , అలాగే ప్రస్తుత ప్రజా ప్రతినిదుల పని తీరు పై ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే సమాచారాన్ని సేకరించారు. ఉప ఎన్నికల్లో ఫలితాన్ని సాదించని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రులను మంత్రి వర్గం నుంచి తొలగించాలని అనుకున్నా చివరి నిముషం లో దానిని విరమించుకున్నారు. ప్రస్తుత ఎం. ఎల్. ఏ. లో చాలా మంది పై ప్రజల్లో విశ్వాసం లేదన్న సమాచారం తెలుసుకున్న వై. ఎస్. ఈ సారి ఎన్నికల్లో గెలుపు గుర్రాలను ఎంపిక చేయడానికి మరో ప్రయోగం చేయనున్నారు. ఎన్నికలకు ఆరునెలల ముందే ప్రతి నియోజక వర్గం నుంచి నలుగురు, లేదా ఐదుగురిని ఎంపిక చేసి నియోజక వర్గం లో వారు చేపట్టే పనులు ఆదారంగా చివరికి ఒక అభ్యర్థి ని ఎంపిక చేయాలని బావిస్తూన్నారు. అంటే ప్రతి నియోజక వర్గం లో నేతల మధ్య పోటీ పెట్టి ఆ పోటీ లో విజేతకే పార్టీ టికెట్టు ఇస్తారని చెబుతున్నారు. ఉప ఎన్నికల ఫలితాల పై సమీక్షలు, అంతర్మధనం సాగుతోంది. సమాలోచనలకు కొదవ లేదు. పార్టీ లో బి. సి. లకు జరుగుతున్న అన్యాయం పై పి. సి. సి. నేత డి. శ్రీనివాస్ అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఉప ఎన్నికల్లో 11 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ సీట్లలో పరాజయాన్ని మూట గట్టుకొని గతం లో కన్నా తగ్గిన ఓట్ల శాతం తో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రానున్న ఎన్నికలు ఒక సవాల్ అని చెప్పక తప్పదు. తమ పార్టీ చేసిన అభివృద్ది తమకు ఓట్ల వర్షం కురిపిస్తుందని కాంగ్రెస్ పార్టీ పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా చిరంజీవి రూపం లో ముంచుకొస్తున్న ప్రమాదాన్ని పసిగట్టి కలవరపడుతోంది. ఉప ఎన్నికల్లో ఆరు అసెంబ్లీ ఒక లోక్ సభ సీటును గెల్చుకున్న కాంగ్రెస్ పార్టీ ఆ గెలుపుకు కారకుడైన వై. ఎస్. ను పొగడ్తలతో ముంచెత్తడం చాలా 'అతి' గా అనిపిస్తోంది. తెలంగాణా ప్రాంతంలో పార్టీ పరాజయాన్ని గురించి డి. శ్రీనివాస్ కూడా అసంతృప్తి తో ఉన్నారు. అభివృద్ది మంత్రం తెలంగాణాలో ఎందుకు పనిచేయలేదో పార్టీ సమీక్షించుకోవాలి. తెలంగాణా రాష్ట్ర సమితి తప్పిదలవల్లే కనీసం ఆరు సీట్ల నైనా గెలవగలిగామని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా గ్రహించాలి. మితిమీరిన విశ్వాసం పెంచుకుంటే ఆది అహంభవానికి దారితీసి పార్టీ కొంప ముంచుతుందన్న సత్యాన్ని తెలుసుకోవాలి.
తెలంగాణా వాదులు ఏ పార్టీలో ఉన్న వారినందరిని కలుపుకొని వెళ్ళాలి అన్న తెలంగాణా రాష్ట్ర సమితి నిర్ణయం సమంజసంగ ఉంది. ఉప ఎన్నికల ఫలితాలతో కళ్ళు తెరిచిన కె. సి. ఆర్ తన తప్పిదాలను అంగీకరించడం శుభ పరిణామం. ఉప ఎన్నికల్లో ఓటమికి తాను బాధ పడ్డానని కె. సి. ఆర్. అన్నారు. ఫలితాలను విశ్లేషించి పార్టీని ప్రక్షాళన చేసి రానున్న ఎన్నికలకు సిద్దం చేయడానికి కె. సి. ఆర్. నడుం కట్టారు. తెలంగాణా మేధావులు, పార్టీ శ్రేయోభిలాషుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తున్నారు. పార్టీ లో అంతర్మధనం మొదలైంది. పార్టీలోని లోటుపాట్లను సవరించి అందరి సలహాలను వింటూ తప్పులను సరిదిద్దడానికి కె. సి. ఆర్ ప్రయత్నిస్తున్నారు. అదే సమయం లో పార్టీకి ద్రోహం చేసిన వారిని గుర్తించి వారి పై చర్యకు సిద్దం అవుతున్నారు. తిరిగి ప్రజల మధ్యకు వెళ్ళి వారి విశ్వాసాన్ని పొందడానికి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఒక్క సెంటిమెంట్ మాత్రమే పనిచేయదని గ్రహించిన కె. సి. ఆర్. ప్రజా సమస్యల పై ఆందోళనలను ఉధృతం చేయాలని నిర్ణయించుకున్నారు.
ఉప ఎన్నిక ఫలితాలు తెచ్చిన ఆనందం అంతలోనే ఆవిరి అవడం తెలుగుదేశం పార్టీని వేధిస్తోంది. తెలంగాణా వాదం టి. డి. పి. ని కుదిపేస్తోంది. తలసాని, దేవేందర్ ల మధ్య ముదురుతున్న వివాదం మరింత ముదర కుండ చూడడానికి చంద్రబాబు వేస్తున్న మంత్రం ఎలా పని చేస్తోందో చూడాలి. ఉప ఎన్నికల ఫలితాలు పార్టీకి ఆశాజనకంగా ఉన్న తరుణం లో పార్టీ అధికార ప్రతినిది తలసాని చేసిన సమైక్య వాద ప్రకటన పార్టీని ఇరకాటం లో పడేసింది. తెలంగాణా అనుకూల , వ్యతిరేక వర్గాలుగా పార్టీలో చీలిక రాక ముందే అదినేత మేలుకొని చర్యలు తీసుకోవాలి. మరి కొద్ది నెలల్లో ఎన్నికలు రానున్నట్లు సంకేతాలు అందుతున్న తరుణం లో తెలంగాణా విషయం లో పార్టీ వైఖరిని స్పష్టం చేయాలి. ప్రభుత్వం పై ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడానికి టి. డి. పి. నేతలు కలిసి కట్టుగా పనిచేయకపోతే ఈ సారి గెలుపు అసాద్యమన్న విషయం చంద్రబాబు తన వారికి వివరించి అందరినీ ఒక తాటిపై నడపాలి. ఈ సారి గనక టి. డి. పి విజయాన్ని సాదించలేక పోతే ఆ పార్టీ భవిష్యత్తు అంధకారమే.
The comments are owned by the poster. We aren't responsible for their content.
| Poster | Thread |
|---|



